అమరావతిపై హైకోర్టులో హోరాహోరీగా వాదనలు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మహాపాదయాత్రకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. రైతుల తరఫున, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.
పాదయాత్రలో 600 మందే పాల్గొంటామని, మధ్యలో ఎవరైనా వైదొలిగితే వారికి బదులుగా ఇతర రైతులను యాత్రకు అనుమతించాలని రైతుల తరఫు న్యాయవాది కోరారు. మధ్యలో వచ్చేవారి వివరాలను కూడా పోలీసులకు అందజేస్తామన్నారు. అలాగే పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినవారిని యాత్రకు ముందుకానీ, వెనకకానీ ఉండేలా అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు నిబంధనలను రైతులు పాటించడంలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గుర్తింపు కార్డులు మాత్రమే పోలీసులు చూపాలని కోరినట్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రైతులంతా గుర్తింపు కార్డులు చూపాలంటూ పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినవారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 41వ రోజున రైతుల పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది.
అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో అమరావతి రైతులు గత నెల 12వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర పొడవులతో పోలీసులతో వాగ్వాదం జరగడంలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలో మూడు రాజధానులకు అనుకూలంగా సభ జరగడంతోపాటు రైతులు విశాఖకు చేరుకున్న తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించారు. అయితే యాత్ర తాత్కాలికంగా వాయిదా పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications