చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు(Chandrababu)కు వ్యతిరేకంగా గతంలో దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లపై విచారణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లయింది.
గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో కొందరికి అనుకూలంగా అప్పటి సీఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రమేయంతో మార్పులు చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుల దర్యాప్తు విజయవాడ ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. అయితే ఈ కేసు దర్యాప్తును ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఆళ్ల మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కొవసాగుతున్న ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఇంకో పిటిషన్ కూడా వేశారు. వీటిపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు.. తోసిపుచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 3 పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ మూడు పిటిషన్ల వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications