సామాన్యులంటే లెక్కలేదా.. 13 ఏళ్లు ఏం చేశారు.. పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్ !
పదమూడేళ్ల క్రితం నమోదైన మహిళ మిస్సింగ్ కేసులో.. ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయకపోవడంపై ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు పురోగతిపై తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని మోహన్‌బ్రహ్మాజికి ఇచ్చి వివాహం చేశారు. అయితే 2012 అక్టోబరు 18న మంగాదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త, ప్రకాశరావుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ప్రకాశరావు అదే రోజు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అయితే కేసు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదని.. తన కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని.. ప్రకాశరావు సీఐడీ, కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల కమిషన్ వంటి పలు అధికార యంత్రాంగాలకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన 2017లో హైకోర్టును ఆశ్రయించారు. లేటెస్ట్ గా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి కేసు ఫైళ్లను పరిశీలించి పోలీసుల దర్యాప్తు తీరుపై మండిపడ్డారు.
ఈ వ్యాజ్యంలో పోలీసులు కౌంటర్ వేస్తూ అదృశ్యమైన ఆమెను కనుగొనేందుకు యత్నాలు జరుగుతున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరిపి ఉంటే అదృశ్యమైన మహిళను కనుగొనేందుకు 13 సంవత్సరాలు పట్టేది కాదని తెలిపింది. ప్రమాణపత్రం వేసేందుకు తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.












Click it and Unblock the Notifications