అమరావతి యాత్ర మరింత ఆలస్యం ? ఏపీ సర్కార్ పిటిషన్ పై హైకోర్టు విచారణ-కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ ఒకే రాజధాని కోరుతున్న రైతులు అరసవిల్లికి పాదయాత్ర చేపట్టారు. దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఆటంకాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాదయాత్ర రద్దు చేయాలంటూ ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి హైకోర్టు నిన్న అంగీకరించలేదు. అయితే ఇవాళ మరో పిటిషన్ పై విచారణ జరిగింది.
రాజధాని రైతుల పాదయాత్రలో 2 వేల మందికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. దీంతో హైకోర్టు కూడా స్పందించింది.

పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ పాదయాత్రే రాజకీయ యాత్ర అని, పాదయాత్రలో భాగం కాని వారు పిటిషనర్ అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది.
ఓ దశలో పాదయాత్ర చేస్తున్న వారు హైకోర్టుపైనే ఒత్తిడి తెస్తారా అని కూడా న్యాయస్ధానం ప్రశ్నించింది. పాదయాత్రలో ముందు రైతులు ఉన్నా వెనుక వేరే వాళ్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ విచారణార్హతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు నుంచి పూర్తి క్లారిటీ తీసుకుని అమరావతి పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు రైతులు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభ్యంతరాలతో మరోసారి దీనికి బ్రేక్ పడినట్లయింది.












Click it and Unblock the Notifications