అన్ని రంగులు ఎందుకు?: జగన్ సర్కారుకు మరోసారి హైకోర్టులో షాక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేయాలని ఇచ్చిన జీవో నెం. 623ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ జీవో ఉందని న్యాయవాది సోమయాజులు పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా..
ప్రస్తుతం ఉన్న రంగులతోపాటూ మరో (మట్టి)రంగును వేయాలని ఏప్రిల్ 23న ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు చేసింది. కేసు విచారణను మే 19కి వాయిదా వేసింది.

రంగులు తొలగించమనడంతో.. నాలుగో రంగుకు సర్కారు ఓకే
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడాన్ని తప్పుబట్టింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రంగులు మార్చే పనిలో ఉంది. మొత్తం నాలుగు రంగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్ని రంగులు ఎందుకంటూ జీవో రద్దు..
ఇప్పటికే వేసిన నీలం, తెలుపు, ఆకుపచ్చతోపాటు కొత్తగా ఎర్రమట్టి రంగు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో వేసిన మూడు రంగులకు తోడు కొత్తగా ఎర్రమట్టి రంగు వేస్తున్నారు. ఇందుకు ఐఏఎస్‌ల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎర్రమట్టి రంగు నేలకు సూచికగా, నీలం రంగు నీలి విప్లవానికి, తెలుపు రంగు క్షీర విప్లవానికి, పచ్చ రంగు వ్యవసాయానికి ప్రతికగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం.
అయితే, అన్ని రంగులు ఎందుకని ప్రశ్నిస్తూ జీవోను హైకోర్టు నిలిపివేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మే 19న దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇప్పటికే వైసీపీ సర్కారుపై రంగుల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.