అమరావతి ఆర్ 5 జోన్: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠత
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అంశాల్లో ఒకటి- రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ. దీన్ని లాంఛనంగా చేపట్టింది కూడా. కిందటి నెల 24వ తేదీన ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ భూమిపూజ సైతం చేశారు.
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ఆర్ 5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నోటిఫై చేస్తూ గతంలో గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని జోన్ ఏర్పాటు చేసినట్లు ఇందులో పొందుపరిచింది.

అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ 5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది. అమరావతిలో పరిధిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఆర్ 5 జోన్‌ను నోటిఫై చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో అవి నిర్మితం కానున్నాయి.
దీనిపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్ 5 జోన్‌కు వ్యతిరేకంగా 18 పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు తన విచారణను ఇదివరకే ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఆర్ 5 జోన్‌పై తీర్పును వెలువడించే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రరాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హారీతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్.. తీర్పు ఇవ్వనుంది.
రాజధాని అమరావతికి సంబంధం లేనివారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికే ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేశారనేది పిటీషనర్ల వాదన, దీనికోసం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదలాయించడం సీఆర్డీఏకు విరుద్ధమంటూ వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన జీఓలు, ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications