పులివెందులలో కౌంటింగ్ ఉందా లేదా ? హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..!
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన 92 ప్రాంతాల్లో అత్యంత సమస్యాత్మకంగా మారిన పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తాము కోరిన స్ధానాల్లో రీపోలింగ్ నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అభ్యర్ధి వైఎస్ ప్రమీల హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి కాకుండానే పులివెందుల (Pulivendula) రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
పులివెందులలోని మొత్తం 80 బూత్ ల్లో 70 చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ నేతలు పోలీసుల సాయంలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని, వీటిలో కేవలం 4 బూత్ ల్లో మాత్రమే ఎస్ఈసీ రీపోలింగ్ కు ఆదేశించిందని వైఎస్సార్సీపీ హైకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయినా ఎస్ఈసీ మాత్రం రేపు పులివెందులలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రేపు పులివెందులలో జరగాల్సిన కౌంటింగ్ ను నిలిపేయాలంటూ హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి.

అనంతరం పులివెందులలో కౌంటింగ్ నిలిపివేతపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ తీర్పును రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఇస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పు ఆధారంగా పులివెందులలో కౌంటింగ్ నిర్వహించాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో వైఎస్సార్సీపీ అక్రమాలు జరిగాయని చెబుతున్న బూత్ ల్లో రీపోలింగ్ పై ఎస్ఈసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి కౌంటింగ్ కు హైకోర్టు లైన్ క్లియర్ చేస్తుందా లేక రీపోలింగ్ పై పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కౌంటింగ్ వాయిదా వేయాలని ఆదేశాలు ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు సైతం రేపు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూడాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి.














Click it and Unblock the Notifications
