పులివెందుల సహా ఈ కేంద్రాల్లో రీ పోలింగ్ - ఎన్నికల సంఘం ఆదేశాలతో..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నిక ల పైన వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిశీలన చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకుల నుంచి నివేదికలు కోరింది. ఆ తరువాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రీ పోలింగ్ కు ఆదేశించింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పులివెందుల సహా పలు ప్రాంతాల్లో రీ పోలింగ్ కొనసాగనుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు పలు కేంద్రాల్లో రీ పోలింగ్ కు నిర్ణయించింది. ఈ మేరకు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పోరేషన్లు, 79 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగ్గా.. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పులివెందులలో తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వలేదని మాజీ సీఎం జగన్ నిరసనకు దిగారు. పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద ధర్నా చేసారు. పులివెందులలో పరిణామాలు పోలింగ్ రోజున పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. అదే విధంగా మరి కొన్ని ప్రాంతాల్లోనే చోటు చేసుకున్న ఘటనల పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో.. సంబంధిత కలెక్టర్ల నుంచి నివేదికలు కోరారు. వెబ్ కెమేరాల ద్వారా అక్కడ జరిగిన పోలింగ్ ను సమీక్షించిన అధికారుల సమాచారం సేకరించారు. దీంతో.. రీపోలింగ్ కు నిర్ణయించారు.

మొదలైన రీ పోలింగ్.. భారీ ఏర్పాట్లు
కాగా.. అధికారుల నివేదిక మేరకు ఎన్నికల సంఘం రీ పోలింగ్ కు ఆదేశించింది. పులివెందులలో 1,3,7, 8 వార్డుల్లో రీ పోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ సీఎం జగన్ పులివెందుల లో మొత్తంగా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు. ఇదే అంశం పైన సుప్రీంకు వెళ్తామని ప్రకటించారు. అదే విధంగా కడప కార్పోరేషన్ లో ఒక వార్డు, అనంతపురం నగరపాలకసంస్థ 30వ వార్డులో ఒకచోట, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాల్టీలోని 23 వార్డులోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలక సంఘం 14వ వార్డులోని ఒక బూత్‌లో రీపోలింగ్ కు నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ జరగనుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. వైసీపీ నేతలు పులి వెందులలో రీ పోలింగ్ కోసం సుప్రీంను ఆశ్రయించటంతో... ఈ రోజు చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications
