జిన్నా టవర్ వద్ద ఎగిరిన జాతీయ పతాకం: హోం మంత్రి, ఎమ్మెల్యేలు
గుంటూరు: రాష్ట్రంలో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న గుంటూరు జిన్నా టవర్ వివాదానికి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. సమస్యాతక అంశాన్ని అంతే సున్నితంగా పరిష్కరించింది. జిన్నా టవర్ పేరును మార్చడం లేదా దాన్ని కూల్చేయాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు, కార్యకర్తలు చేస్తోన్న డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గంగా దీన్ని పరిష్కరించింది.
గుంటూరు నడిబొడ్డున ఉన్న టవర్‌కు పాకిస్తాన్ ఆవిర్భవించడానికి ప్రధాన కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం పట్ల బీజేపీ కొంతకాలంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ టవర్ పేరును మార్చాలని వారు డిమాండ్ చేస్తోన్నారు. లేదా దాన్ని కూల్చేయాలని పట్టుబడుతున్నారు. దేశ గణతంత్ర దినోత్సవం నాడు జిన్నా టవర్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి హిందూ వాహిణి ప్రతినిధులు ప్రయత్నించారు.

జిన్నా టవర్ వివాదం మరింత తీవ్రతరం కాకముందే- ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఈ టవర్‌కు జాతీయ పతకం రంగులను వేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు- రెండు రోజుల్లో ఈ టవర్‌కు మువ్వన్నెలను అద్దారు. టవర్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పార్క్‌లాగా దాన్ని తయారు చేశారు. టవర్‌కు పక్కనే ఓ భారీ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
కొద్దిసేపటి కిందటే జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్ రావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్,
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇతర అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బెలూన్లను గాల్లోకి వదిలారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం ఏ ఒక్కరికో పరిమితమైనది కాదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది- జిన్నా టవర్‌ను నిర్మించే సమయానికి పుట్టి ఉండరని అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో గుంటూరు జిల్లాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, అది చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు.












Click it and Unblock the Notifications