ఏపీ అసెంబ్లీ, మండలిలో విప్ లు వీరే-టీడీపీ, బీజేపీ, జనసేనకివే..!
ఏపీ అసెంబ్లీతో పాటు మండలిలోనూ విప్ లను ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‍గా జీవీ ఆంజనేయులు, ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్‍గా పంచుమర్తి అనురాధ వ్యవహరించనున్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. అలాగే మండలిలో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో విప్‍లుగా 15 మందిని నియమించారు. విప్‍లుగా టీడీపీ నుంచి బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా.థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావుకు అవకాశం దక్కింది. జనసేన నుంచి విప్‍లుగా బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ కు అవకాశమిచ్చారు. బీజేపీ నుంచి విప్‍గా ఆదినారాయణరెడ్డిని నియమించారు. మండలిలో విప్ లుగా టీడీపీకి చెందిన వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ కు అవకాశం దక్కింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ విప్ ల నియామకం జరగలేదు. దీంతో ఎమ్మెల్యేల్లోనూ, మంత్రి పదవి దక్కని వారిలోనూ అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని గమనించిన చంద్రబాబు.. ఇవాళ జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల భేటీలో విప్ లను ఖరారు చేశారు. దీనిపై కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. విప్ ల జాబితాలో కూటమిలోని టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు వారి సంఖ్యాబలం ఆధారంగా కేటాయింపులు జరిగాయి.
ఏపీ అసెంబ్లీలో విప్ పదవులు దక్కించుకున్న వారిలో బెందాళం అశోక్, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, కాల్వ శ్రీనివాసులు, గణబాబు, తంగిరాల సౌమ్య సీనియర్ ఎమ్మెల్యేలే. వీరిలో పలువురు కేబినెట్ బెర్తులు కూడా ఆశించారు. అలాగే జనసేన నుంచి విప్ లు గా ఎంపికైన వారంతా కొత్త వారే. అలాగే టీడీపీలోని ఇతర విప్ లు కూడా కొత్తవారే. బీజేపీ విప్ గా ఎంపికైన ఆదినారాయణరెడ్డి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో విప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications