కాపు సోదరా.. మోసపోకురా.. అంబటి రాంబాబు వేడుకోలు.. !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం మంత్రులకు చుట్టుకుంటోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి మంత్రులుగా కొనసాగుతున్న అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, బొత్స వంటి వారికి ఈ సెగ గట్టిగానే తగులుగుతోంది. అదే సమయంలో తాజాగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ వార్తలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిన్న చంద్రబాబు-పవన్ భేటీపై వారు తీవ్రంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్- చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం తమపై కచ్చితంగా ఉంటుందని భావిస్తున్న కాపు మంత్రులు, వైసీపీ కాపు నేతలు ఇప్పుడు వీరిద్దరిని టార్గెట్ చేసే ప్రయత్నాల్లో ఉంటున్నారు. అదే సమయంలో తమ సొంత సామాజిక వర్గం కాపుల్ని కూడా ఈ రాజకీయాల్ని నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. అంతర్గతంగా ఇప్పటికే ఈ విషయంపై కాపుల్ని అప్రమత్తం చేస్తూ వస్తున్నప్పటికీ పవన్ సీఎం అయితే చాలనే కాపులు చాలా మందే ఉన్నారు. దీంతో ఇదే అంశంపై కాపు మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. కాపుల్ని ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు.

కాపు సోదర ....మోసపోకురా !
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
పవన్ని నమ్మి... బాబు పల్లకి మోయకురా !
నిన్న పవన్-చంద్రబాబు భేటీపై స్పందిస్తూ ట్వీట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబు.. కాపు సోదరా.. మోసపోకురా.. పవన్ ను నమ్మి అంటూ వేడుకున్నారు. బాబు పల్లకి మోయకురా.. అంటూ మరో విజ్ఞప్తి కూడా చేశారు. ప్రస్తుత పరిస్దితుల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లు భావిస్తున్న తరుణంలో కాపులు పవన్ ను నమ్మొద్దని, బాబు పల్లకి మోయొద్దని అంబటి చేసిన విజ్ఞప్తి వారిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. గతంలో పలుమార్లు ఇదేవిషయాన్ని పలు సందర్భాల్లో చెప్పిన అంబటి.. మరోసారి ట్వీట్ రూపంలో చెప్పారు.












Click it and Unblock the Notifications