ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామికి తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు ఆదివారం మంత్రి బాల వీరాంజనేయ, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నాయకులు, యువత.. మంత్రితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
ఈ క్రమంలో డీజే సౌండ్‌కు ఎద్దులు బెదిరిపోయి ఒక్కసారిగా మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. దీంతో బోర్లా పడిన మంత్రి బాల వీరాంజనేయపై ఎద్దు ముందు కాలితో బలంగా తొక్కింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, పార్టీ నాయకులు ఎద్దులను అడ్డుకుని మంత్రిని ప్రమాదం నుంచి కాపాడారు. ఘటన తర్వాత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి చేరుకున్న మంత్రికి వైద్యులు చికిత్స అందించారు.

జాగ్రత్త మంత్రి గారు.
— VamsiKrishna Bandaru (@VKBandaru18) July 28, 2024
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వారికి తృటిలో తప్పిన ప్రమాదం. pic.twitter.com/QMaZA25uIN
కాగా, ఈ విషయం తెలిసిన నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు, దామచర్ల పూర్ణచందర్రావు మంత్రి నివాసానికి వచ్చి పరామర్శించగా.. పలువురు నేతలు ఫోన్ ద్వారా ఘటన వివరాలు తెలుసుకుని పరామర్శించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలడగా ఉందని, నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications