TSPCSపై బొత్స కామెంట్స్ వివాదం-తెలంగాణ మంత్రుల కౌంటర్ అటాక్..
తెలంగాణలో పరీక్షల నిర్వహణను ఏపీతో పోలుస్తూ ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో స్కామ్ ఎలా జరిగిందో అంతా చూస్తూనే ఉన్నామన్నారు. అన్ని చూచి రాతలే అన్నారు. ఎంతమంది అరెస్టు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని బొత్స విమర్శించారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం తో పోల్చకూడదన్నారు. ఎవరి ఆలోచన వారిది ఎవరి విధానం వారిదన్నారు.

తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై స్కాంపై ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అక్కడి మంత్రులు వెంటనే స్పందించారు. బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజధాని కూడా లేని రాష్ట్రం అది అన్నారు. బొత్స అలా మాట్లాడటం సరికాదని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలంటూ బొత్సకు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కూడా బొత్సను శ్రీనివాస్ గౌడ్ కోరారు.
తెలంగాణలో మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా బొత్స వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీలో అసలు విద్యావ్యవస్ధ ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని గురుకులున్నాయి, ఏపీలో ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్కాం బయటపెట్టింది తామే కదా అన్నారు. ఏపీలో బదిలీల్లోనూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. జగన్ కన్నుసన్నల్లో బొత్స మాట్లాడకపోతే ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని గంగుల డిమాండ్ చేశారు. తమకు ఉద్యమాలు చేయడం వచ్చు, కయ్యాలు పెట్టుకోవడం కూడా తెలుసన్నారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ స్కాం జరిగితే తాము నిందితుల్ని అరెస్టు చేశామని, కానీ ఏపీపీఎస్సీ అక్రమాలపై ఎన్ని అరెస్టులు చేశారని గంగుల ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ విభజన కావడం వీరికి ఇష్టం లేదని, అందుకే విషం చిమ్ముతున్నారని గంగుల ఆరోపించారు.












Click it and Unblock the Notifications