
ఎన్టీఆర్ చేతకానోడు-సీఎంగా ఉండీ వెన్నుపోట్లా ? వైఎస్సార్ తో పోలికా ? మంత్రి దాడిశెట్టి రాజా కామెంట్స్
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ గా మార్చిన నేపథ్యంలో ఏపీలో మొదలైన రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ నేతలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుండగా.. టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరు మార్పిన జగన్ పై భగ్గుమంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ లక్ష్మీపార్వతి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అనంతరం ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఇదే అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

దాడిశెట్టి రాజా మరో సంచలనం
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇవాళ మరో సంచలనం రేపారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న దాడిశెట్టి రాజా వైసీపీ ప్లీనరీతో పాటు పలు సందర్భాల్లో సంచలనాలు రేపారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరుగుతున్న మాటలయుద్ధంలో ఆయన చేరారు. ఎన్టీఆర్ గొప్పా, వైఎస్సార్ గొప్పా అంటూ జరుగుతున్న చర్చలపై తీవ్రంగా స్పందించారు. అలాగే అమరావతి రైతులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతులు కాదు రియల్ ఎస్టేట్ మేళం..
అమరావతి రైతులు రాజధాని కోసంచేస్తున్న పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిస్ధితులపై మంత్రి దాడిశెట్టి రాజా ముందుగా స్పందించారు. అమరావతి రైతుల రూపంలో రియల్ ఎస్టేట్ మేళం రాష్ట్రమంతా తిరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మందుచూపుతో ఇలాంటి మేళాలన్నీ రద్దు చేశారన్నారు.
చంద్రబాబు మాత్రం ఇలాంటి మేళాల్ని ప్రతీ నియోజకవర్గం పంపుతూ, అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ వ్యంగ నాటకాలు చేస్తున్నారని రాజా విమర్శించారు. ఎన్ని వెకిలిచేష్టలుచేసినా ప్రజలు వాటిని భరిస్తున్నారని రాజా తెలిపారు.

ఎన్టీఆర్, వైఎస్సార్ లకు పోలికా?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు తర్వాత రాష్ట్రంలో వారం రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లను పోలుస్తూ కూడా చర్చ జరుగుతోందన్నారు. అయితే వారిద్దరికీ ఎలాంటి పోలికలు లేవని మంత్రి తెలిపారు. ఈ విషయంలో పోలిక తీసుకురావాల్సిన అవసరం కూడా లేదని రాజా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరినీ పోలుస్తున్న వారిపైనా మంత్రి దాడిశెట్టి రాజా ఇవాళ విరుచుకుపడ్డారు. వారిద్దరికీ అస్సలు పోలిక తేవదన్నారు.

ఎన్టీఆర్ అంత చేతకానోడు లేడు..
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య పోలిక తేవడంపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి దాడిశెట్టి రాజా.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని తన వ్యక్తిగత వ్యాఖ్యలుగానే అభివర్ణించారు. రామారావు అంత చేతకానోడు దేశంలోనే లేడని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రమంతా గుప్పిట్లో ఉండగా, సీఎంగా ఉండగా రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి మంత్రి పేర్కొన్నారు. సీఎంగా ఉండి రెండుసార్లు నాదెండ్ల భాస్కరరావు, అల్లుడు చంద్రబాబుతో వెన్నుపోట్లు పొడిపించుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ప్రజల మనిషని, ఇది తన సొంత అభిప్రాయమని మంత్రి చెప్పుకొచ్చారు.