మద్య నిషేధమా... ఆ మాటెప్పుడు చెప్పాం మేం?.. నిరూపించండంటూ మంత్రి సవాల్!!
మద్యం పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయని, అధికారంలోకి రాగానే మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వివరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని, కేవలం 5 స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తామని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన వివరణ వింతగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ప్రశ్నించారు. స్పందించిన మంత్రి అసలు తమ పార్టీ మద్యనిషేధం అనే మాటే చెప్పలేదని తేల్చేశారు.
మద్య నిషేధం అనేదే తమ పార్టీ మానిఫెస్టోలో లేదని మంత్రి గువాడ అమర్ నాథ్ తేల్చేశారు. ఎన్నికల ప్రణాళికలో తాము ఈ మాట చెప్పాం.. చెప్పిన మాట ప్రకారం చేయలేదేంటని ప్రశ్నించండి అంటూ విలేకరులకు ఆయన సవాల్ విసిరారు. మద్యం ధరలు 5 స్టార్ హోటల్స్ కంటే ఎక్కువ పెడతాం.. ఎవరైనా ముట్టుకోవాలంటే షాక్ కొట్టే పరిస్థితికి తీసుకొస్తామని మాత్రమే మేనిఫెస్టోలో చెప్పామన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా తమ పార్టీ మేనిఫెస్టో గోడలపై ఉంటుందని, కావాలంటే వెళ్లి చూసుకోవచ్చనడంతో విలేకరులంతా అవాక్కయ్యారు.

అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యనిషేధంపై ఇచ్చిన మాట తప్పిందని, ధరలు ఇష్టమొచ్చినరీతిలో పెంచేసి అమ్ముతున్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన మండిపడుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినట్లు అమలు చేయకుండా ప్రభుత్వం మాట తప్పుదోందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications