మీ మామ ఇంట్లో కాల్పులు.. మీ తాతకు వెన్నుపోటు: ప్రమాణం చేస్తావా: నారా లోకేష్‌కు కౌంటర్
అమరావతి: మాజీమంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం పట్ల తిరుపతి గరుడ వారధి వద్ద ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌కు.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వైఎస్ వివేకా హత్యోదంతాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించకుండా నిషేధిస్తూ జీవోలను జారీ చేసిన టీడీపీకి.. ఇప్పుడదే సీబీఐ పేరును ఎత్తే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

వాటిపై ప్రమాణం చేసే సత్తా ఉందా?
నారా లోకేష్ ప్రమాణం చేయాల్సింది..వైఎస్ వివేకా హత్యపై కాదని, అలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయని ఆయన చదవి వినిపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తన తాత ఎన్టీ రామారావును తండ్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్నారా? లేదా? అనే విషయం ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? అని కన్నబాబు నిలదీశారు. తన మామ నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని నారా లోకేష్ అదే తిరుపతిలో ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం ఘాట్ల వద్ద తొక్కిసలాటకు చంద్రబాబు, నారా లోకేష్ కారణమని గుర్తు చేశారు.

రాజకీయ దౌర్భల్యం..
పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం తన కుటుంబం కాదని నారా లోకేష్ ప్రమాణం చేయగలరా అని ఎదురుదాడికి దిగారు. చెప్పుకోవాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయని అన్నారు. అవన్నీ వదిలేసి.. వైఎస్ వివేకా హత్యను రాజకీయ అవసరాల కోసం, తిరుపతి ప్రజల ఓట్ల కోసం వాడుకోవడం టీడీపీ దైన్యస్థితికి, నారా లోకేష్ దౌర్భల్యానికి అద్దం పడుతోందని కన్నబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్‌కు లేదని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీని ప్రశ్నించడానికి ఎందుకు భయం..
సీబీఐ పరిధిలో, దర్యాప్తులో ఉన్న వైఎస్ వివేకా హత్యోదంతం పేరుతో నారా లోకేష్ సరికొత్త డ్రామాకు తెర తీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉండగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదంటూ జీవో తెచ్చారని, ఈ హత్య జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఉన్నారని, అప్పుడే వారెందుకు సీబీఐకి ఇవ్వలేదని కన్నబాబు అనుమానాలను లేవనెత్తారు. సీబీఐ ఒక్కటే కాదని, ఏదర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. లోకేష్‌వి పిల్ల చేష్టలు, బుర్రతక్కువ పనులని ఎద్దేవా చేశారు.

తనను తాను గెలిపించుకోలేని దద్దమ్మ లోకేష్..
151మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సత్తా వైఎస్ జగన్‌కు ఉంటే.. తనను తాను గెలిపించుకోలేని అసమర్థుడు నారా లోకేష్ అని కురసాల కన్నబాబు నిప్పులు చెరిగారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనే విషయం నారా లోకేష్ మరిచిపోయినట్టు ఉన్నాడని ఆయన చురకలు అంటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా అనడానికి నారా లోకేష్‌కు ఎందుకు భయమని ప్రశ్నించారు. టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చెప్పారంటే పరిస్థితి ఎక్కడికి దిగజారిపోయిందో అర్థం అవుతోందని కన్నబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications