మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ అందుకే ... ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఈ విషయాన్ని నివేదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ద్వారా అఫిడవిట్ దాఖలు చేసింది. వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గతంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా 3 రాజధానుల బిల్లుల రద్దుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఒకపక్క మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతుల పోరాటం ఫలించిందని, దాదాపు రెండేళ్లుగా అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రాజధాని రైతుల పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మహా పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులకు 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు జగన్ సర్కార్ హైకోర్టుకు నివేదించటం ఊరట కలిగించింది. హైకోర్టు రాజధానుల విషయంలో విచారణ స్పీడ్ గా జరుపుతున్న క్రమంలో జగన్ సర్కార్ ఆ బిల్లులు కోర్టులో నిలబడవని ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం త్రిసభ్య ధర్మాసనం ముందు తమ నివేదికను ఉంచింది. సోమవారం మధ్యాహ్నం 2.15 నిమిషాలకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై కీలక విచారణ జరపనుంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అమరావతి రైతుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. జగన్ నిర్ణయాన్ని రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 3 రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై స్పందించారు.
అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని టెక్నికల్ గా అనేక సమస్యలు వస్తున్న కారణంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని వెల్లడించారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కొడాలి నాని, కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయట తాను మాట్లాడకూడదు అని చెబుతూ కొడాలి నాని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మొత్తానికి 3 రాజధానులపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం వెనక మతలబు ఏంటి అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన తర్వాతే మూడు రాజధానులు వ్యవహారంలో జగన్ ఏం చేయబోతున్నారు అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications