pinipe viswarup : మంత్రి పినిపే విశ్వరూప్‌కు అస్వస్థత- రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స
ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇవాళ అస్వస్ధతకు గురయ్యారు. తన నియోజకవర్గమైన అమలాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. ఆయన అస్వస్ధతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను రాజమండ్రికి తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విశ్వరూప్ కు చికిత్స అందిస్తున్నారు.
అమలాపురంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో విశ్వరూప్ ఇవాళ చురుగ్గా పాల్గొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత స్ధానికంగా పేదలకు సరుకుల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం బయలుదేరి వెళ్లే సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సహాయకులు, పార్టీ కార్యకర్తలు వెంటనే ఆయన్ను అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.

రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో విశ్వరూప్ ను పరీక్షించిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశ్వరూప్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊరటపొందారు. అమలాపురం నుంచి గెలిచి జగన్ తొలి కేబినెట్లో మంత్రి అయిన విశ్వరూప్ కు జగన్ రెండో కేబినెట్లోనూ మరోసారి అవకాశం కల్పించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై జరిగిన ఆందోళనల్లో విశ్వరూప్ ఇళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. అయినా ఆయన వెరవకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అంబేద్కర్ పేరును జిల్లాకు సాధించుకున్నారు.












Click it and Unblock the Notifications