పెద్ద మనసుతో విధుల్లో చేరండి- అంగన్ వాడీలకు ఏపీ సర్కార్ విజ్ఞప్తి..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అంగన్ వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల అంగన్ వాడీ కేంద్రాలకు వర్కర్లు వేసిన తాళాలను ప్రభుత్వం పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సాయంతో పగులగొట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్ వాడీల రెండు డిమాండ్లను నెరవేరుస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అయినా వారు శాంతించలేదు.
ఈ నేపథ్యంలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇవాళ అంగన్ వాడీ వర్కర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు పెద్ద మనసుతో దయచేసి విధులకు హాజరు కావాలని ఆమె కోరారు. బాలింతలు,చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. అంగన్వాడీల డిమాండ్ లపై సానుకూలంగా స్పందించామని గుర్తుచేశారు. ఇప్పటికేఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ ను వర్కర్స్ కు 50 వేల నుంచి లక్షకు, హెల్పర్స్ కు 20 నుంచి 40 వేలకు పెంచామన్నారు.

హెల్పర్స్ కు పదోన్నతి వయసు 45 నుంచి 52 ఏళ్లకు పెంచినట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ గుర్తుచేశారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. టీఏ,డీఏ లు ప్రతి నెలా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంగన్వాడీల డిమాండ్స్ అన్నీ పరిష్కరిస్తూ జీవో లు జారీ చేశామన్నారు. తెలంగాణ తో సమానంగా జీతాలు ఇవ్వాలని మేనిఫెస్టో లో పెట్టామని, ఇచ్చిన మాట ప్రకారం 2019 లో జీతాలు 11,500కు పెంచామన్నారు. హెల్పర్స్ కు రాష్ట్ర వాటా రూ.4750, వర్కర్స్ కు రాష్ట్ర వాటా రూ.7000 ఇస్తున్నామని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. అంగన్వాడీల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కానీ నిరసనలు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదన్నారు.












Click it and Unblock the Notifications