ఏ బీసీ తల వంచే పరిస్థితి లేదు - చంద్రబాబు చెప్పగలరా : మంత్రుల యాత్ర ప్రారంభం..!!
రాష్ట్రంలో ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. ఆ సమయంలో పలువురు మంత్రులు ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని మంత్రులు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలతో ఆర్దికంగా వారికి చేయూతనివ్వటంతో పాటుగా.. రాజ్యాధికారంలోనూ భాగస్వాములను చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మంత్రులు వివరించారు. మొత్తం 17 మంది మంత్రులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగే బస్సు యాత్రలో పాల్గొంటున్నారు.

నాలుగు రోజులు - 26 జిల్లాలు
నాలుగు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మూడేళ్ల కాలంలో ఏ వర్గానికి ఏ మేర ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నారు. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారని..ఇది జగన్ ఓక్కరే చేయగలరని మంత్రి ధర్మాన చెప్పారు. ఎవరూ జగన్ ను ఇలా చేయమని అడగలేదని..ఆయనే స్వతహాగానే ఈ అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయని గుర్తు చేసారు. కానీ, జగన్ పాలనలో ఇప్పుడు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పనిలేదన్నారు.

పథకాలు - పదవుల గురించి వివరిస్తూ
చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగారని,,. కానీ, మేము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగారా అంటూ ధర్మాన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీలకు ఇచ్చారని..దీనిని కొందరు హేళన చేస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టేనని ధర్మాన వ్యాఖ్యానించారు. ఈ వర్గాలకు చెందిన వారికి గౌరవం పెరిగేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారని.. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. దీనిని సజీవ సాక్షంగా నిలబడాలనే బస్సు యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.

మూడేళ్ల పాలన - లబ్ది పైన ప్రచారం
ఈ మూడేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం చేస్తున్న కృషిని దేశమంతా చూస్తోందని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. జగన్. ఆ వర్గాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు తాము బస్సు యాత్ర ప్రారంభించామని వివరించారు. బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సమాజంలో విప్లవాత్మక మార్పులను తెస్తామన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని బొత్స పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications