ప్రభుత్వంతో పోరాడక్కర్లేదు - తేల్చేసిన ఏపీ ఉద్యోగ సంఘం..!!
ఏపీలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం లేదని ఏపీ ఎన్జీఓ సంఘం తీర్మానించినట్లు సమాచారం. పలు సంఘాల తమ ఉనికి కోసమే ఉద్యమిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి వెనుక ఎక్కువ మంది ఉద్యోగులు లేరని ఆ సంఘ నేతలు చెబుతున్నారు. ఉద్యమం చేస్తున్న సంఘాలు ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నాయని నాయకులు పేర్కొన్నట్లు సమాచారం.
ఉద్యమం అవసరం లేదు:ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ అమరావతి జేఏసీతో పాటుగా మరి కొన్ని సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మూడో దశ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో కీలకమైన ఏపీ ఎన్జీవో ఈ ఉద్యమాల పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ ఎన్జీవో కార్యనిర్వాహక కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో 13 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటుగా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేంలో మూడు జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే ప్రస్తుతం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. మిగిలిన జిల్లాల నేతలు వీరికి మద్దతు ఇవ్వలేదు.

పీఆర్సీ పై వేచి చూద్దాం:ఇతర జిల్లాల నేతలెవరూ స్పందించకపోవటంతో ఉద్యమం అవసరం లేదని అధ్యక్షుడు తేల్చినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఏపీ అమరావతి జేఏసీ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఎన్జీవో నేతలు హాజరు అయ్యారు. ఉద్యమం చేయటం పైన తమ సంఘ కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ మేరకు జరిగిన సమావేశంలో ఉద్యమం అవసరం లేదని తేల్చారు. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ లకు సంబంధించి కొంత మొత్తం చెల్లించారని, మిగిలిన వాటిని ప్రభుత్వం చెల్లిస్తామని చెబుతున్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పీఆర్సీ వేసేందుకు జూలై వరకు సమయం ఉందని, ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.
సీఎం జగన్ ను ఆహ్వానిద్దాం:ఇదే సమయంలో మరో కీలక ప్రతిపాదన చేసారు. ప్రస్తుతం ఏపీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘంగా ఉండగా, దీనిని ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అధికారుల సంఘంగా మార్పు చేయనున్నారు. ఇందు కోసం గెజిటెడ్ అధికారులను సభ్యులుగా తీసుకోనున్నారు. ఏపీఎన్జీవో కౌన్సిల్ సమావేశాన్ని గుంటూరులో నిర్వహించాలని..దీనికి సీఎం జగన్ ను ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో పీఆర్సీతో పాటుగా ఇతర సమస్యల పైన ప్రభుత్వంతో చర్చలు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications