టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం-వైసీపీ ఆఫీసుకు నోటీసులు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై అధికార పార్టీ నేతలు దాడికి ప్రయత్నించారు. విజయవాడ, గుంటూరు నుంచి తరలివచ్చిన వైసీపీ నేతలు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. అయితే ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు.. వైసీపీ కేంద్ర కార్యాలయానికి తాజాగా నోటీసులు ఇచ్చారు. 8 రోజుల క్రితం వైసీపీ ఆఫీసుకు పంపిన నోటీసులు ఆలస్యంగా వెలుగుచూశాయి.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతోంది ? అక్కడ ఉన్న నేతలెవరు ? అనేది తెలుసుకోవడం కోసం ఆ రోజు మొత్తం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆగస్టు 16నే ఈ నోటీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాయి. దీనిపై వైసీపీ ఆఫీసు స్పందించి ఫుటేజ్ ఇచ్చిందో లేదో మాత్రం తెలియలేదు.

ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దాదాపు అర డజను వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి జోగి రమేశ్, విజయవాడ నేత దేవినేని అవినాష్ వంటి వారు ఉన్నారు. వీరంతా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని పక్కా ఆధారాలు సేకరించేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఫుటేజ్ దొరికితే టీడీపీ ఆఫీసుపై దాడి కోసం వైసీపీ ఆఫీసు నుంచే నేతలు బయలుదేరి వెళ్లారా లేదా అన్నది తేలనుంది.












Click it and Unblock the Notifications