పవన్ కల్యాణ్ మూలాలపై జగన్ మార్క్ దెబ్బ: గోదావరి గట్టున కొత్త సమీకరణం
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతుయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పర్యటనల బాట పట్టనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటలనూ మొదలు పెట్టారు. సంక్షేమ పథకాల నిధులను ఆయన జనం మధ్యే విడుదల చేస్తోన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతోంది. బాదుడే బాదుడు కార్యక్రమంతో జిల్లాల్లోనూ పర్యటిస్తోంది.

పర్యటనలతో..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు దిగబోతోన్నారు. దసరా తరువాత ఈ టూర్ ప్రారంభం కానుంది. దీనికోసం కాన్వాయ్‌ను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేనాధీశుడు పవన్ కల్యాణ్ సైతం బలంగా విశ్వసిస్తోన్నారు.

కాపులపై దృష్టి..
ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం కాపు ఓటు బ్యాంక్‌పై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కాపు సామాజిక వర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని, రాజకీయాలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శిస్తోన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా లబ్ది కలిగించే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే వాదనలూ లేకపోలేదు. దీనితో ఆ ఓటు బ్యాంక్‌ను ఆకట్టుకోవడానికి ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది.

ప్రభుత్వ హయాంలో..
కాకినాడ జిల్లా గొల్లప్రోలు సభలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి తామే కాపు కాస్తోన్నామంటూ ఆయన తేల్చి చెప్పారు. నవరత్నాల్లో గానీ, ఎన్నికల మేనిఫెస్టోలో గానీ పొందుపరచనప్పటికీ.. కాపు నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజికవర్గ ప్రజలను ఆదుకుంటోన్నామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో 1,492 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశామనీ చెప్పారు.

టీడీపీ-జనసేనపై ఉమ్మడిదాడి..
అదే సమయంలో తెలుగుదేశం-జనసేన పార్టీలపై ఉమ్మడి దాడి చేశారు వైఎస్ జగన్. కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు ఓటుబ్యాంక్ మొత్తాన్నీ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మళ్లించడానికి ప్రయత్నిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పాలనలో కాపులకు స్థితిగతులనూ ఆయన ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో 1,500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడని ఆరోపించారు.

ఆ ఓటుబ్యాంక్..
తమ ప్రభుత్వ విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కాగా, చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే పార్టీల ఆలోచన డీపీటీ అని ఎద్దేవా చేశారు. దోచుకో..పంచుకో..తినుకో అనే విధానంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, దుష్ఠచతుష్ఠయం ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. కాకినాడ జిల్లాలో కాపు ఓటుబ్యాంకు అధికం. పవన్ కల్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కాపులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం నుంచీ పవన్ కల్యాణ్-చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడం..రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాపు గడ్డపై..
2024 ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు, అంచనాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అదే గడ్డపై పవన్ కల్యాణ్‌తో పాటు చంద్రబాబుపైనా ఘాటు విమర్శలు చేయడం, వారి వల్ల కాపు సామాజిక వర్గానికి ఒరిగిందేమీ లేదంటూ గుర్తు చేయడం ఆసక్తి రేపుతోంది. పవన్ కల్యాణ్-చంద్రబాబును కాపుల నుంచి దూరం చేయడానికి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ వ్యవహరించారనేది స్పష్టమౌతోంది. ఇది అక్కడి సమీకరణాలను తారుమారు చేయగలదని అంటున్నారు.












Click it and Unblock the Notifications