ఏపీకి హెచ్చరిక: బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాలు వదలడంలేదు. మరో మూడురోజులపాటు వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా మరో అల్పపీడం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గతవారంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఒడిసా, చత్తీస్ గడ్ మీదుగా పయనిస్తోంది. ఈ నెల 26వ తేదీ లేదంటే 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
సూర్యుడిని చూసి రెండువారాలు
రాష్ట్రంలో ప్రజలు సూర్యుడిని చూసి దాదాపు రెండువారాలు అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతమై ప్రతి ప్రాంతంలో కనీస వర్షాలు కురువడంతోపాటు మెట్ట ప్రాంతాల్లో కూడా చిరు జల్లులు పడుతున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, నాలుగు రోజులుపాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరిక జారీచేశారు. వీటితోపాటు ఆగస్టు మొదటివారంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.

సహాయక బృందాలు సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైతే వారిని తరలించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు సహాయక బృందాలను సిద్ధం చేసింది. సహాయక చర్యలపై అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికీ సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications