ఏపీకి వానగండం.. తాజా హెచ్చరిక పంపిన వాతావరణ శాఖ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఋతుపవనాలు మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం ఆగస్టు నెలలో దేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణంగా నమోదవుతుందని చెబుతున్నారు. ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు దేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి ఇచ్చిన నివేదికను వెల్లడించింది.
నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు
అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
గోదావరి వరద ఉధృతి ఇలా
ఇదిలా ఉంటే గోదావరి వరద నెమ్మదిగా తగుముఖం పట్టింది. గురువారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 41.20 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి ఉధృతి తగ్గింది. అయినప్పటికీ గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా నది వరద ఇలా
మరోవైపు కృష్ణానదికి వరద పోటెత్తడంతో శ్రీశైలంలోని 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ వద్ద కూడా కృష్ణా నది వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications