ఏపీలో కరోనా కల్లోలం- 24 గంటల్లో 1155 కేసులు- 13 మంది మృతి - మూడు జిల్లాల్లో భయానకం..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. పలు జిల్లాల్లో పరిస్ధితులు చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటిపోగా... మూడు జిల్లాల్లో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తున్న పరిస్ధితి నెలకొంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులిటెన్ లోనూ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

కొనసాగుతున్న కల్లోలం
ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం దారుణంగా మారిపోయింది. వైరస్ వ్యాప్తి గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఉండటంతో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1155 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రులు కూడా నిండిపోయి పలు చోట్ల హోం క్వారంటైన్లకే పంపిస్తున్న పరిస్ధితులు ఉన్నాయి. నిన్నటి నుంచి అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో గుంటూరు జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. జిల్లాలో 24 గంటల్లో 238 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో అనంతపురం (153), విశాఖ (123), తూర్పుగోదావరి (112), శ్రీకాకుళం (104), కృష్ణా (100) జిల్లాలు ఉన్నాయి. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 21,197కు చేరుకుంది.

భారీగా మృతులు...
ఏపీలో ఇప్పటివరకూ మృతుల సంఖ్య నియంత్రణలో ఉందని భావించినా వాటి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో వివిధ జిల్లాల్లో 13 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. వీరిలో కర్నూల్లో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరు, విశాఖపట్నంలో ఇద్దరేసి, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఒక్కరేసి చనిపోయారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోననా కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 252కు చేరుకుంది. అయితే ఇప్పటివరకూ ఏపీలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారెవ్వరూ చనిపోలేదు.

డిశ్చార్జ్ లు పెరుగుతున్నా...
ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ డిశ్చార్జ్ ల సంఖ్య కూడా బాగానే ఉంటోంది. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,745గా ఉంది. వీరిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వీటిని తీసేస్తే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 11200గా నమోదైంది. డిశ్చార్జ్ ల సంఖ్య ఎంత పెరుగుతున్నా అంతకు మించి కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటివరకూ ఏపీలో పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 10 లక్షల 50 వేల 990కి చేరుకుంది.












Click it and Unblock the Notifications