ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీషెడ్యూల్- తాజా తేదీలివే..!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ను ఈ మేరకు సవరిస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు గతంలో ప్రకటించిన ఎన్నికల పోలింగ్, రీ పోలింగ్, కౌంటింగ్ తేదీలు కూడా మారాయి. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తేదీలు మార్చడం, తుఫాన్ వంటి కారణాలతో ఈ మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. 5వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నవంబర్ 3వ తేదీనే రావడంతో, ఈ రెండు ఎన్నికల మధ్య గందరగోళం చోటు చేసుకోకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ లో సవరణలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 5న జరుగుతాయి, అలాగే రీ పోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 7న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఒకే రోజు రావడంతో పోలీసులతో పాటు పోలింగ్ సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు ఇవాళ మార్పులతో కూడిన రీషెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో నవంబర్ 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని, నవంబర్ 6న అదే సమయాల్లో అవసరమైతే రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. అలాగే నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీసు, పోలింగ్ సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటం కోసమే ఇలా షెడ్యూల్‌ను సవరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.














Click it and Unblock the Notifications
