జీపీఎస్ కూడా రద్దు చేయండి-సచివాలయ ఉద్యోగుల వినతి-నచ్చజెప్పిన డిప్యూటీ సీఎం..!
ఏపీలో వైసీపీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేసింది. దాని స్ధానంలో జీపీఎస్ పేరుతో మరో కొత్త విధానం తీసుకొచ్చింది. సీపీఎస్ విధానం తరహాలో కాకుండా ఉద్యోగులు సర్వీస్ లో ఉన్న కాలంలో కేవలం 10 శాతం కాంట్రిబ్యూషన్ తో పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఇచ్చేలా ఈ విధానం రూపొందించారు. అయితే దీనిపైనా ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది.
సీపీఎస్ రద్దు తర్వాత తీసుకొచ్చిన జీపీఎస్ కూడా రద్దు చేయాలని కోరుతూ ఇవాళ ఏపీ సచివాలయ ఉద్యోగులు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను కలిశారు. ఈ మేరకు ఆయనకు ఓ వినతి పత్రం కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి కొట్టు.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జీపీఎస్ తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం చేసిన కసరత్తును వారికి వివరించారు. వైసీపీ హామీ ఇచ్చినట్లుగానే సీపీఎస్ విధానం రద్దు చేశామన్నారు.

ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించే జీపీఎస్ ప్రతిపాదన తెచ్చిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఉద్యోగులకు తెలిపారు.ఇతర రాష్ట్రాలు కూడా జీపీఎస్ గురించి ఆలోచిస్తున్నాయన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఇతర రాష్ట్రాలన్నీ జీపీఎస్ లోకి వస్తాయని జోస్యం చెప్పారు. అయితే తమకు జీపీఎస్ వద్దని సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు ఆయనకు తేల్చి చెప్పారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ కు వచ్చాయని ఉద్యోగులు డిప్యూటీ సీఎంకు చెప్పారు.
ఇలా కొద్దిసేపు మంత్రికి జీపీఎస్ పై నచ్చచెప్పేందుకు సీపీఎస్ ఉద్యోగులు ప్రయత్నించారు. అయితే డిప్యూటీ సీఎం కొట్టు మాత్రం సీఎం ఆన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని వారికి వివరించారు. జీపీఎస్ ప్రతిపాదనతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులెవరూ సంతృప్తిగా లేరని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు ఆయనకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications