MLC Sabji Death: ఎమ్మెల్సీ సాబ్జీది హత్యేనా ? పోలీసుల తీరుతో ఫ్యామిలీకి డౌట్స్!
ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ నిన్న అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఉండి మండలం చెరుకుపాడు దగ్గర ఆయన కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన తీరు, పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుతో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇది ప్రమాదం కాదు హత్యేనంటున్నారు.
నిన్న రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చనిపోయిన తీరుపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చి మరీ సాబ్జీ కారును మరో కారు ఢీకొనడటం, ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న వారు పరారు కావడం, ప్రమాదం జరిగినప్పటి నుంచి రకరకాలుగా వచ్చిన వార్తలు, పోలీసులు అనుమానాస్పద మృతిగా కాకుండా కేవలం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటంతో కుటుంబ సభ్యుల అనుమానాలు పెరిగాయి.

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా వరుసగా రెండోసారి ఎన్నికైన షేక్ సాబ్జీ మరోసారి అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్ధిని ఓడించారు. ఆ తర్వాత ఆయనపై టీటీడీలో వీఐపీ పాసులు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఈ మరణం వెనుక కుట్రకోణం ఉందనే ఆరోపణలు చేస్తున్నారు. తన తండ్రిది సాధారణ మరణం కాదని, ఎవరో కుట్ర పూరితంగా పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని ఆయన కుమారుడు ఆజాద్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎదురుగా వస్తున్న కారు సాబ్జీ కూర్చున్న కారును కేవలం ఆయనవైపు మాత్రమే ఢీకొట్టడం, అందువల్లే ఆయన చనిపోవడం కూడా ఈ ఘటనపై అనుమానాలు రేపుతోంది. అలాగే సాబ్జీ కారును ఢీకొట్టిన కారు నంబరు మాత్రమే పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పడం, ప్రమాద కారణాలు వెల్లడించకపోవడం కూడా కుటుంబానికి అనుమానాలు కలిగిస్తోంది. ఈ ప్రమాదం తర్వాత నిందితులు ఎక్కడికి పారిపోయారు, వారి వివరాలను పోలీసులు చెప్పకపోవడం కూడా అనుమానాలు పెంచుతోంది.
మరోవైపు అనుమానాస్పద మృతిగా నమోదు చేయాల్సిన కేసును కేవలం రోడ్డు ప్రమాదంగానే నమోదు చేశారని పోలీసుల్ని అడిగితే మరో ఫిర్యాదు ఇవ్వాలని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ మాత్రమే పోలీసుల ముందు లొంగిపోవడం, కారులో ఉన్న ఇతరులు పారిపోవడంతో ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications