APలో BRS.. తెలంగాణలో జనసేన? వ్యూహం అదిరింది!!
ఏపీ, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో అర్థంకాని పరిస్థితి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాని ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ముందస్తు రాదని చెబుతున్నప్పటికీ ఇరుపార్టీల శ్రేణులు మాత్రం కచ్చితంగా ముందస్తు వస్తాయని చెబుతున్నారు.

ఎవరి వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
జాతీయ పార్టీ హోదా సంపాదించాలంటే నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు బీఆర్ఎస్ తెచ్చుకోవాలి. ఏపీలో కార్యాలయం నిర్మించడంతోపాటు రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టబోతోంది. దీనివల్ల అధికార వైసీపీకి లాభమా? నష్టమా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. మరోవైపు ఏపీలో పొత్తులతో వెళతామని చెబుతున్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీచేయాలని భావిస్తోంది. ఇక్కడ జనసేన పోటీచేయడంవల్ల టీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? అనే చర్చ ప్రారంభమైంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారా?
32 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను ప్రకటించిన జనసేన ఇతర నియోజకవర్గాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగే పవన్ కల్యాణ్.. అదే కేసీఆర్ కు ప్రత్యర్థి అయిన చంద్రబాబుతో ఏపీలో పొత్తుపై వార్తలు వస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, వైసీపీకి లాభం కలుగుతుందనే అంచనాలుండగా, తెలంగాణలో జనసేన పోటీవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, దీనివల్ల కేసీఆర్ కే లాభమనే వాదన వినిపిస్తోంది. వీరిద్దరూ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే కోణంలో కాకుండా పరస్పర ప్రయోజనాల కోసమే పోటీచేస్తుండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాలి
అంతేకాకుండా ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా జనసేన కొనసాగుతోంది. తెలంగాణలో మాత్రం పొత్తు లేదు. జనసేనతో పొత్తు విషయాన్ని ఇక్కడి బీజేపీ లైట్ తీసుకుంది. ఎన్నికలు జరిగితే అధికారంలోకి రాగలమనే ఆత్మవిశ్వాసం ఆ పార్టీలో కనపడుతుండటంతో జనసేన అవసరంలేదనుకుంటోంది. ఏపీలో మాత్రం ప్రధాని మోడీ రోడ్ మ్యాప్ ఇవ్వడంతోపాటు పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పడంతో ఏపీ రాజకీయాలపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల పోటీవల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం కలగబోతోందో స్పష్టత రావాలంటే ఎన్నికలు జరిగి వాటి పలితాలు వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు.












Click it and Unblock the Notifications