మూడు రాజధానుల పై ఫలితాల ఎఫెక్ట్ - వాట్ నెక్స్ట్..!?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త అంచనాలకు కారణమవుతున్నాయి.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త అంచనాలకు కారణమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ఏర్పాటు పైన ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ప్రతిపక్ష పార్టీలు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర - రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ..పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించాయి.
మూడు రాజధానుల అంశం మరోసారి చర్చకు కారణమైంది. వైసీపీ మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. రాజకీయంగానూ పైచేయి సాధించేలా ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విశాఖ పరిపాలనా రాజధాని కానుందని..త్వరలో అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూ వచ్చారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే జూలైలో విశాఖ వెళ్దామంటూ సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతితో పాటుగా ఉత్తరాంధ్ర- రాయలసీమలో రాజధానుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.

ఉత్తరాంధ్ర - రాయలసీమలో రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీతో సహా ప్రతిపక్షాలు ఆ రెండు రీజియన్లలోనూ రాజకీయంగా నష్టపోతారనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పట్టభద్రులే ఆ రెండు రీజియన్లలో రాజధానులు వ్యతిరేకిస్తున్న టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏడు లక్షల మంది ఈ మూడు ఎమ్మెల్సీల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటింగ్ లో పాల్గొన్నారు. పట్టభద్రులే తమకు రాజధానులు దగ్గర చేస్తామంటున్న పార్టీకి కాకుండా..వ్యతిరేకిస్తున్న పార్టీకి మెజార్టీ సంఖ్యలో ఓట్లు వేయటం ఇప్పుడు రాజధానుల అంశంలో చర్చకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్యలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి సంఖ్య తక్కువనేది..వీరి అభిప్రాయమే ఉత్తరాంధ్ర - సీమ ప్రజల మొత్తం అభిప్రాయంగా పరిగణించలేం అనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ, టీడీపీకి మాత్రం తమ వాదన సమర్ధించుకొనేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయి. మూడు రాజధానులు అనేది రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన నిర్ణయమని... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఈ అంశాన్ని ముడిపెట్టలేమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల వెనుక అనేక సమీకరణాలు పని చేసాయని విశ్లేషిస్తున్నారు. వైసీపీ నేతలు గతంలో టీడీపీ అధికారం లో ఉన్న సమయంలో వైసీపీ గెలుచుకున్న ఎన్నికల అంశాన్ని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications