జీతాల టెన్షన్ : అయిదు రోజులు - రెండు నెలల బిల్లులు : ట్రెజరీల పైనే..!!
ఫిబ్రవరి జీతాలు అందుకోవటానికి సమయం దగ్గర పడుతోంది. ప్రభుత్వం కొత్త పీఆర్సీని 2022 జనవరి నుంచి అమలు చేసింది. ఆ సమయంలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో..ఉద్యోగులు, డీడీవోల సహాయనిరాకరణ కు దిగాయి. ఫలితంగా పీఆర్సీ జీతాల బిల్లులు సమర్పించలేదు.
కానీ, ప్రభుత్వం మాత్రం జనవరి జీతాలు ఖచ్చితంగా కొత్త వేతనం ప్రకారం ఫిబ్రవరి 1నే ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. దీంతో 24,496 మంది డీడీవోలు చేయాల్సిన పనిని ఒక ఖజానాశాఖ డైరక్టర్ చేసేలా ఆదేశాలిచ్చి జీతాల పద్దు నుంచి కాకుండా సస్పెన్స్ ఖాతా ద్వారా జనవరి జీతాలు చెల్లించింది.

కొత్త వేతన సవరణ ప్రకారం
దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని డీడీవోలు వాస్తవంగా ఏ ఉద్యోగికి జనవరి జీతం ఎంత ఇవ్వాలో లెక్కకట్టాలి. సస్పెన్సు ఖాతాకు డీడీవోలంతా జీతం హెడ్‌లను డెబిట్ చేసేలా సర్దుబాటు చేయాలి. ఇందు కోసం అయిదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ అయిదు రోజుల్లోనే రెండు నెలల బిల్లుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో మొత్తం 4,96,875 మంది ఉద్యోగుల జనవరి జీతాలు 010 పద్దు కింద చెల్లించినట్లు డ్రాయింగ్ డిస్‌బర్సుమెంట్ అధికారులు ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాత కొత్త వేతన సవరణ ప్రకారం స్కేళ్లు తయారుచేసి అదనంగా చేర్చాల్సినవి, వారి జీతం నుంచి మినహాయించినవి తేల్చి, వాటిని ఖజానా అధికారులకు సమర్పించాలి.

అయిదు రోజులే సమయం
ఇందుకోసం ఫిబ్రవరి 25 డెడ్ లైన్. ఆ తేదీ లోగా పూర్తి చేయకుంటే జీతాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో.. ఈ అయిదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్దిక శాఖ ఆదేశాలిచ్చింది. సాధారణంగా జీతాల బిల్లులు 25వ తేదీలోగా సమర్పించకుంటే..మరుసటి నెల 5వ తేదీ తరువాత సప్లిమెంటరీ బిల్లుల ద్వారా సమర్పించే ఛాన్స్ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వలేదు.
ఎలాగైనా ఈ అయిదు రోజుల్లోనే రెండు నెలల బిల్లులను సిద్దం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల వేతన స్థిరీకరణ కార్యక్రమం ఇంకా డీడీవోలు, ఖజానా అధికారులు, పే అండ్ అకౌంట్సు అధికారుల వద్ద డేటా ఎంట్రీ నమోదు, నిర్ధారణ ప్రక్రియ పూర్తిచేయలేదు.

రెండు నెలల బిల్లలు
ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందనేది స్పష్టత లేదు. ఇక, ప్రతి డీడీవో నుంచి సస్పెన్సు ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తానికి సమానమైన మొత్తం బిల్లు జనరేట్ చేసి సంబంధిత సర్దుబాటు బిల్లు ట్రెజరీకి పంపితే అక్కడ సస్పెన్స్ ఖాతా సర్దుబాటు బిల్లులను ఆమోదిస్తారని చెబుతున్నారు. దీంతోపాటు ఫిబ్రవరి జీతాల బిల్లులు తయారుచేసి ఖజానాలకు సమర్పించాలి. ఈ మొత్తం వ్యవహారం తో ఇప్పుడు ట్రెజరీలపైన పని భారం భారీగా పడుతోంది. ఈ అయిదు రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రక్రియ పూర్తవుతుందా .. లేదా అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications