ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న రెండు వ్యవస్దల్లో ఒకటి వాలంటీర్ల వ్యవస్ధ, మరొకటి సచివాలయాల వ్యవస్ధ. వాలంటీర్ల వ్యవస్ధలో భాగమైన దాదాపు 3 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేసిన కూటమి సర్కార్.. ఇప్పుడు సచివాలయాల విషయంలోనూ రేషనలైజేషన్ కు సిద్దమవుతోంది. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రేషనలైజేషన్ పేరుతో తమ ఉద్యోగ భద్రతకు ముప్పుతెస్తే రోడ్డెక్కేందుకు వారు సిద్దమవుతున్నారు.
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని తాజాగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగుల్ని రెండు రకాలుగా విభజించడం, 2500 ఇళ్లకో సచివాలయం ఉండేలా చూడటం వంటివి ఉన్నాయి.
అయితే దీనిపై కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం జరగలేదు. అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోనూ చర్చించలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రక్షాళన చేసేందుకు సిద్దమైపోయింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించి మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలు జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించడమే సరైన విధానం అని వారు చెప్తున్నారు. అలాగే ఉన్నత చదువులు చదివిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో అర్హత మేరకు అవకాశాలు పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.
ఇవేవీ చేయకుండా రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతామని ప్రకటించడంపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నష్టం జరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యే సందర్భంలో న్యాయం కోసం ఉద్యోగుల హక్కులు కాపాడడమే ప్రధాన అజెండాగా అలుపెరుగని ప్రయత్నం కొనసాగించడానికి లక్షా 30 వేల మంది సిద్ఘంగా ఉన్నారని వారు చెప్తున్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల నియమ, నిబంధనలకు అనుగుణంగా చట్టానికి లోబడి ఐక్యకార్యాచరణ రూపొందిస్తామని వారు ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా సందేహాలను నివృత్తి చేస్తూ,ఉద్యోగులకు మరియు వ్యవస్థకు మేలు చేకూర్చేలా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోరుతోంది.












Click it and Unblock the Notifications