కేసీఆర్ రెచ్చగొట్టినా శాంతి: ఏపీ కేబినెట్, రాజధాని పైన..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చర్చించి ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాలలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్ చేస్తే ఆయనకే లాభమని, పదే పదే విమర్శించడం ద్వారా ఆయన ఇమేజ్ తెలంగాణలో పెరిగిపోతుందని మెజార్టీ ఏపీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసీఆర్ పాలన పైన తెలంగాణ ప్రజలు తమ అసంతృప్తి వెళ్లగక్కే వరకు ఓర్పు వహించాలని భావిస్తున్నారు. కేసీఆర్ రెచ్చగొట్టి, సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నారని, దానిని ఆపాలంటే ఏపీ మంత్రులు కొంత ఓపిక వహిస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు.
మంత్రి రావెల కిషోర్ బాబు సహా పలువురు మంత్రివర్గంలో దీనిని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కావాలని రెచ్చగొట్టేలా చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని, దానిని అడ్డుకోవాలంటే కొంతకాలం ఓపిక పట్టమమే మంచిదని చెప్పారట. ఆయన వాదనతో ఎక్కువ మంది మంత్రులు ఏకీభవించారట.

ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ అమలయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలో పేర్కొనడంతోపాటు ఏ షెడ్యూలులోనూ పేర్కొనని 37 సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని వివాదాలను లేవనెత్తుతోందని, వాటి విషయంలో జోక్యం చేసుకుని ఇరు రాష్ర్టాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత, ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు, ఉద్యోగుల విభజన, వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలవరం ముంపు ప్రాంతాలు తదితర అంశాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని, రాద్ధాంతం చేస్తున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చట్టంలో పొందుపరచిన కొన్ని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ విషయంలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రపతితోపాటు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఏపీ కేబినెట్
తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్న అంశాలపై ఉభయ రాష్ట్రాల ప్రజలకు వాస్తవాలు వివరించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పదే పదే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలోని అపోహలు తొలగించాలని నిశ్చయించింది. అన్ని అంశాలపై కలిసి కూర్చుని మాట్లాడటానికి రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని సమావేశం నిర్ణయించింది.

ఏపీ కేబినెట్
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రోజుకో వివాదం సృష్టించి దానితోనే గడుపుతోందని, అభివృద్ధి వెనకపడుతోందని కొందరు మంత్రులు ఆరోపించారు. ‘‘సచివాలయంలో ముళ్ల కంచెతో మొదలు పెట్టారు. కవిత మాటలు, ఎంసెట్ అడ్మిషన్లు, ఎన్జీ రంగా యూనివర్సిటీ వివాదం తదితరాలను రోజుకొకటిగా తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ అధికారాలను వివాదంగా మారుస్తున్నారు. గవర్నర్ అధికారాలను విభజన చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. అది తప్పంటే మొత్తం విభజననే తప్పుబట్టినట్లు లెక్క. మనం మన వాదనను ప్రజల్లోకి ప్రముఖంగా తీసుకువెళ్దాం'' అని సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రెచ్చగొట్టే పద్ధతిలో కాకుండా చట్టంలో ఏం ఉందన్న విషయాన్ని ప్రజలకు ప్రశాంతంగా వివరించాలని, తెలుగుదేశం పార్టీకి రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రజలంతా కావాలని చంద్రబాబు అన్నారు.

ఏపీ కేబినెట్
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుతానికి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో తేల్చి చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఏర్పాటవుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాజధాని తమ ప్రాంతంలో పెట్టాలంటూ ప్రజల నుంచి తమపై ఒత్తిడి వస్తోందని కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి కేఈ కృష్ణమూర్తి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. దాంతో, దొనకొండలో పెట్టాలని రాఘవరావు అంటారని, కర్నూలులో మంచిదని కృష్ణమూర్తి అంటారని, తచన నియోజకవర్గం కుప్పంలో రాజధాని పెడితే బాగుంటుందని తనకూ ఉందని, ప్రతి జిల్లావారూ తమ వద్ద రాజధాని పెట్టాలని కోరుకోవడం సహజమేనని కానీ, ప్రజల కోణంలో చూసినప్పుడు రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండటం అందరికీ సౌలభ్యం. ప్రభుత్వ అభిప్రాయం ఇదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు కూడా దీనిపై ఆచితూచి మాట్లాడాలని, ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో రాజధాని కావాలని ప్రకటనలు చేయవద్దని, వారు మొత్తం రాష్ట్రానికి మంత్రి కానీ వారి వారి జిల్లాలకు కాదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications