పవన్ వివరణ ఇవ్వాల్సిందే, చర్యలు - వాసిరెడ్డి పద్మ..!!
ఉమెన్స్ మిస్సింగ్ ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఆధారాలు చూపించాల్సిందేనని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేసారు. దేని ఆధారంగా ఆయన ఆరోపణలు చేశారో చెప్పాలని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై జారీ చేసిన నోటీసులకు వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని...ఆ వివరణకు అనుగుణంగా కమిషన్ పరంగా తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసిన పద్మ ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేసిందన్నారు. అదే విధంగా ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అందజేస్తున్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశ యాప్ తీసుకవచ్చిందని గుర్తుచేశారు. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు ఇలా ఎవరిపైనైనా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం తప్పేనన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిలో సీఎం కుటుంబ సభ్యులు, మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా పోతుందన్నారు. పవన్ కల్యాణ్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసారు.

ఏపీలో 18 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటూ ఏలూరు, తాడేపల్లి సభల్లో మాట్లాడాడని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడాతారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అందుకే పవన్ కల్యాణ్‌కు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. వలంటీర్ల సమాచారం ఆధారంగా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ పవన కల్యాణ్ ఆరోపించారని, దేని ఆధారంగా ఆయన ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీకి నాయకుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇంతలా దిగజారి మాట్లాడటం భావ్యం కాదని వాసిరెడ్డి పద్మ అన్నారు.
మహిళలను పవన్ చులకన భావనతో చూస్తున్నాడని, మహిళా కమిషన్‌ను సైతం గౌరవించడం లేదన్నారు. కేంద్రంలో, తెలంగాణలో ఈ పరిస్థితి లేదన్నారు. ఒకరు, ఇద్దరు వలంటీర్లు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారని గుర్తుచేశారు. తమపై జనసేన కార్యకర్తలు ట్రోలింగ్‌లు చేస్తున్నారని, అందుకు జనసేన పార్టీని పవన్ రద్దు చేయాలని చెప్పగలమా అని వ్యాఖ్యానించారు. ఇందుకు పవన్ కల్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మహిళల జోలికి వస్తే ఎవరూ ఊరుకోరని చెప్పారు.












Click it and Unblock the Notifications