Weather: ఏపీలో మండిపోతున్న ఎండలు, కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వరకు వడగాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం బయటికి రావాలంటే జనం జంకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న వేడి గాలుల కారణంగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి.

రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని అనేక చోట్ల 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. కోయిలకుంట్లలో 42.6 డిగ్రీలు, గురజాలలో 41.85, అనంతపురంలో 41.6, చిత్తూరులో 41.55, జమ్మలమడుగులో 41.4, కనిగిరిలో 41.2, తిరుపతిలో 40.2, విజయవాడలో 39.2, విశాఖపట్నంలో 33.9, ఒంగోలులో 36.8, గుంటూరులో 37.4, నెల్లూరులో 39.7, కాకినాడలో 34, విజయనగరంలో 36.9, ఏలూరులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది ఇలావుండగా, తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. పదేళ్ల రికార్డు బద్దలైంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.












Click it and Unblock the Notifications