ఏపీకి జవాద్ తుఫాను ముప్పు: భారీ వర్షాలు కురిసే అవకాశం, మత్స్యకారులకు హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో చిత్తూరు సహా పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే, మరికొద్ది రోజులపాటు వర్షాలు రాష్ట్రాన్ని వీడేటట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే. ఇప్పుడు తమిళనాడుతోపాటు ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.

ఏపీకి జవాద్ తుఫాను ముప్పు
దక్షిణ అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. నవంబర్ 15 నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తుఫానుకు జవాద్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
ఇప్పటికే తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాలు కుండపోత వర్షాలతో అల్లాడిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇంకా పలు గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో వర్షాలు ఇంకా దంచికొడుతున్నాయి. చెన్నై నగరాన్ని కూడా ఇంకా వరద ముప్పువీడలేదు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి కన్యాకుమారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతోన్న వానలతో కన్యాకుమారి ప్రాంతమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోత వానలతో కన్యాకుమారి నుంచి అన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్ష బీభత్సం
మరోవైపు దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలావుండగా, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో జిల్లాలో 4 కోట్ల రూపాయల వరకు పంటనష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో 36 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి, కూరగాయలు, పూలు, వేరుశనగ, చెరకు, రాగి, మొక్కజొన్న పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో ఎస్పీడీసీఎల్ కు 3 కోట్ల 20 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. 445 విద్యుత్ స్తంభాలు, 234 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 13 చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో జిల్లాలో 26 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. సహాయక శిబిరాల్లో 1315 మందికి పునరావాసం కల్పించారు.

కుండాపోత వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు
చిత్తూరు, నెల్లూరుతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 3 లక్షల హెక్టర్లలో వరి సాగు చేశారు రైతులు. అయితే అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయని అన్నదాతలు వాపోతున్నారు. భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో నదులు ఉధృత రూపం దాల్చాయి. పెన్నా నది ఉధృతితో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు అధికారులు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళంతోపాటు పలు జిల్లాలు భారీ వర్షాల కారణంగా పంటలన్నీ నీటమునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇప్పటకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications