షర్మిల చేరికపై సమాచారం ఉందన్న పీసీసీ ఛీఫ్- త్వరలో కిరణ్ తో- చంద్రబాబు-డీకే చర్చ దీనిపైనే !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో హల్ చల్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల చేరికపై పీసీసీ అధ్యక్షుడు గిడుగు మరోసారి స్పందించారు. తనకున్న సమాచారం మేరకు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇవాళ వెల్లడించారు. షర్మిలతో పాటు పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పక ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలోనే కలుస్తానని గిడుగు వెల్లడించారు. తనకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.ఏఐసీసీ పెద్దలు, పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వీరి విషయంలో నడుచుకుంటామన్నారు.

ఇప్పటికే సీపీఐ నారాయణతో మాట్లాడామన్న గిడుగు రుద్రరాజు... భావ సారుప్యత కలిగిన పార్టీలు, సంస్థలు, వ్యక్తులతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్టులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం చంద్రబాబు మధ్య జరిగినవి రాజకీయ సంబంధిత చర్చలే అయి ఉంటాయన్నారు. ఏదేమైనా సెక్యులర్ పార్టీలతో ముందుకు వెళ్లాలా.. మతోన్మాద పార్టీల కొమ్ము కాయాలా అనేది చంద్రబాబు, జగన్ లే నిర్ణయించుకోవాలని ఓ ప్రశ‌్నకు సమాధానంగా గిడుగు వెల్లడించారు.












Click it and Unblock the Notifications