ఏపీలో ఈ అయిదు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు: బిగ్ అలర్ట్
Summer: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరవ అవుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ మార్క్‌ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అనంతపురంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది కూడా. ఇదే పరిస్థితి మరిన్ని రోజుల పాటు ఉండొచ్చు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు- ప్రత్యేకించి రాయలసీమలో ఎండ తీవ్రత అధికమౌతుందని, సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రత రికార్డుస్థాయిలో నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడు కానున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడు కావడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
గురువారం అయిదు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కడప- 11, నంద్యాల- 4, పార్వతీపురం మన్యం- 3, అల్లూరి సీతారామరాజు- 2, కాకినాడ- 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications