హరీష్ వర్సెస్ దేవినేని: కలిసి చాయ్ తాగమని ఉమా భారతి సూచన
న్యూఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాల విషయమై వాదిస్తున్న సమయంలో.. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కేంద్రమంత్రి ఉమాభారతి జోక్యం చేసుకున్నారు.
నందిగామ ప్రాంతానికి తెలంగాణ భూభాగం నుంచి నీరు ఇవ్వాలని, అందుకు సహకరించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రస్తావించారు. దానిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.

తాము సహకరిస్తున్నా ఏపీ తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నందున ఆదా అయ్యే నీటిలో తమకూ వాటా కావాల్సిందేనని హరీశ్ రావు వాదించారు.
మాటలు అదుపు తప్పుతున్నాయని భావించిన ఉమా భారతి జోక్యం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అప్పుడప్పుడూ ఇరువురు సీఎంలు, మంత్రులు కలిసి చాయ్ తాగండని, మాట్లాడుకోండని, అప్పుడు ఇలా విభేదాలుండవని ఆమె సముదాయించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications