ఏపీలో భిన్న వాతావరణం: ఉత్తరాంధ్రకు కీలక సూచనలు
Heavy Rains: ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవంక భారీ వర్షాలు పడుతుండగా.. మరో వంక ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వడగాలులు సైతం వీస్తోన్నాయి కొన్ని ప్రాంతాల్లో. పొడి వాతావరణం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంట, అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సిద్ధవటంలో 40.3 డిగ్రీల సెల్సియస్ మేర పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. ఇదే తీవ్రత మరికొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

విజయనగరం- 12, పార్వతీపురం మన్యం- 10, శ్రీకాకుళం- 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూడు మండలాల్లో నేడు వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనిజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పొడి వాతావరణం ఏర్పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత పెరగొచ్చు.
అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా కనిగిరిలో 43.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం- 34, ప్రత్తిపాడు- 33, అల్లూరి సీతారామరాజు- గూడెం కొత్తవీధిలో 30 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications