తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం- ఏపీలో వర్షాలు: అక్కడ అత్యధిక వర్షపాతం నమోదు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదు.
ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర అల్పపీడనంగా మారింది. బంగాళాఖాతం వాయువ్య దిశలో ఉత్తర ఒడిశా తీరంపై ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఉత్తర ప్రాంతం వైపు కదిలడానికి అవకాశం ఉంది. 5వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 54 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో 53.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. అలాగే- ఈ నెల రెండోవారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఈ అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications