బంగాళాఖాతంలో నైరుతి- ఏపీలో భారీ వర్షాలు
Monsoon in Bay of Bengal 2025: నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్- నికోబార్ అంతటా రుతు పవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. క్రమంగా- జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే.. మే 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది.

దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఉత్తర కోస్తా రీజియన్‌లోని అంబేద్కర్ కోనసీమతో పాటు పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడటానికీ అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి విపత్తు నిర్వహణ విభాగం విజ్ఞప్తి చేసింది.
అలాగే బుధవారం నాడు 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండలాల్లో తీవ్ర, మరో 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం నాడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో అత్యధికంగా 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications