బంగాళాఖాతంలో వాయుగుండం?: ఏపీలో అక్కడ అత్యధిక వర్షం
Bay of Bengal: బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత విస్తరిస్తోన్నాయి. ఈ సాయంత్రానికి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తమిళనాడు ఉత్తర ప్రాంతం దిశగా కదులుతోందని వివరించింది. ఫలితంగా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ ఆవర్తనం ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తరువాతి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిశాయి. సాయంత్రం 7 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 52 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.
అనంతపురం జిల్లా చిన్నమూష్టూరులో 51.5 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 50, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48, కృష్ణా జిల్లా గిలకలదిండిలో 47 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. రాష్ట్రంలో 43 వేర్వేరు ప్రాంతాల్లో 30 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది.












Click it and Unblock the Notifications