జగన్ సర్కార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్: సబ్‌స్క్రిప్షన్ వివరాలివే- కొత్త సినిమాలు విడుదల
అమరావతి: ఏపీ ప్రభుత్వం సొంతంగా ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ తరహా కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. విడుదలైన తొలి రోజే కొత్త సినిమాలను చూసేలా ఫస్ట్ డే-ఫస్ట్ షో పేరుతో కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ దీన్ని పర్యవేక్షిస్తుంది. శుక్రవారం విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
99 రూపాయల సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్రజలు అప్పుడే విడుదలైన కొత్త సినిమాలను ఇళ్లల్లోనే చూడొచ్చు. సాధారణంగా అప్పుడే విడుదలైన సినిమాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైకి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా ఫస్ట్ డే- ఫస్ట్ షో కాన్సెప్ట్ కింద విడుదలైన తొలి రోజే 99 రూపాయలతో కుటుంబం మొత్తం ఆ సినిమాలను చూడొచ్చు.

పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎల్లుండి విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టాలీవుడ్ నటుడు సాయి రోనక్, నిర్మాతల మండలి సభ్యులు సీ కళ్యాణ్, రామసత్యనారాయణ తదితరులు దీనికి హాజరుకానున్నారు. తొలి సినిమాగా నిరీక్షణను విడుదల చేయనున్నట్లు ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్‌నెట్ కనెక్టివిటీ ఉన్నందున, అదే పనిగా పట్టణాలకు వచ్చి సినిమాలు చూడలేని వారికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలు, థియేటర్ల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. థియేటర్లకు వచ్చి సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన అవసరం లేదని చెప్పారు.
ఫైబర్‌నెట్ కార్పొరేషన్ నిర్మాతలను సంప్రదించి, వారి అనుమతిని తీసుకున్న తరువాతే సినిమాలను ప్రసారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి 55,000 కిలోమీటర్ల ఓఎఫ్‌సీ కేబుల్ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 37 వేల కిలోమీటర్ల కేబుల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. 11,254 గ్రామ పంచాయతీల్లో 7,600 గ్రామాలకు ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఇచ్చామని అన్నారు.












Click it and Unblock the Notifications