ఏపీలో 22 వేల కోట్ల పెట్టుబడులు - 5300 ఉద్యోగాలు-ఎస్ఐపీబీ ఆమోదం
ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం భారీగా పెట్టుబడుల్ని కూడా ఆకర్షిస్తోంది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో భారీ ఎత్తున పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దీంతో భారీగా ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో పలు కీలకమైన ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రూ.22 వేల కోట్లతో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీఎస్ఐపీబీ ఇవాళ ఆమోదం తెలిపింది. వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 5300 ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించబోతోంది. ఇవాళ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ రాయలసీమ జిల్లాల్లోనే రాబోతుండటం మరో విశేషం.

వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ముందుకొచ్చింది. వీటి కోసం జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్ధ దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
అలాగే నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్ ప్రాజెక్టులను జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రూ.1287 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 4 వేల కోట్లతో ఏర్పాటు చేసే మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయి.
మరోవైపు కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. రూ.1350 కోట్లు ఖర్చుతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌లను రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. రూ.3600 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సంస్ధ చెబుతోంది.












Click it and Unblock the Notifications