APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్- టికెట్లపై 10 శాతం డిస్కౌంట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతూ ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెడుతోంది. మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఊటీ, గోవా, పుదుచ్చేరికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ సర్వీస్ పేరుతో ప్రతి శనివారం నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్య ప్రవేశపెట్టిన బస్సుకు మంచి డిమాండ్ లభిస్తోంది.

ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో స్టార్ లైనర్, నైట్ రైడర్, ఇంద్ర బస్ సర్వీసుల సంఖ్యను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప.. వంటి జిల్లా కేంద్రాల నుంచే కాకుండా ఇతర పట్టణాల నుంచీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు స్టార్ లైనర్, నైట్ రైడర్ బస్సులను ప్రవేశపెట్టింది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా టికెట్ల కొనుగోలుపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాను పోను టిక్కెట్లు ఒక్కసారే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. తాము ఎక్కదలిచిన బస్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి, గమ్యస్థానం నుంచి మళ్లీ తమ సొంత స్థలాలకు ఒకేసారి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ 10 శాతం రాయితీ లభిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రానుపోను టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఇన్‌స్టంట్‌గా 10 శాతం డిస్కౌంట్ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే అనేక రకాల ప్యాకేజీలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోన్నామని, ఇందులో భాగంగా గతంలో ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లల్లో బస్సులను తిప్పుతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications