ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం-ఈ బస్సుల్లో ఎక్కితే షాకులే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీ మేరకు ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఉచిత బస్సు పథకం అమలుకు విధివిధానాలను నిన్న కేబినెట్ భేటీలో ఆమోదించారు. వీటి ప్రకారం ఏయే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుంది, ఏయే బస్సుల్లో అమలు కాదో కూడా తేల్చేశారు. దీంతో మహిళలు ఆయా బస్సుల్ని చూసుకుని ఉచిత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే షాకులు తప్పేలా లేవు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రభుత్వం స్త్రీశక్తి అనే పేరు పెట్టింది. ఈ పథకం అమల్లో భాగంగా మొత్తం ఐదు రకాల సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళల్ని అనుమతిస్తారు. ఇందుకోసం ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీల్లో ఏదో ఒక కార్డు చూపించి ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సుల్లో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, నగరాల్లో మెట్రో, సిటీ సబర్బన్ సర్వీసులు ఉంటాయి. వీటిలో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగానే ప్రయాణించవచ్చు.

అయితే ప్రీమియర్ సర్వీసులు అయిన నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డు లో వెళ్లే బస్సులకు ఈ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వర్తింపజేయడం లేదు. ఈ బస్సుల్లో పొరబాటున ఎక్కినా కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా బస్సుల్లో మాత్రం జీరో టికెట్ ఇస్తారు. ఈ బస్సుల్లో ఎక్కితే మాత్రం సాధారణంగా ఇచ్చే టికెట్లు తీసుకోవాలి. దీంతో మహిళలు ఏయే బస్సుల్లో తమకు ఉచిత ప్రయాణం అనుమతించారో చూసుకుని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఇలా ఏ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారో, ఏయే బస్సుల్లో అనుమతించరో ముందుగానే సిబ్బందికి ఆర్టీసీ శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రేపు బస్సుల్లో ఎక్కే మహిళలకు ఎలాంటి వివాదాలు లేకుండా వివరించేందుకు వీలుగా సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఓసారి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలయ్యాక ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలంటే ఆర్టీసీ సిబ్బందితో పాటు మహిళలకు కూడా సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications