APSRTC తో ఉద్యోగుల చర్చలు విఫలం..! జేఏసీ కీలక ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలన్న నిర్ణయం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతోంది. 1450 విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేసి, వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ ఇవాళ మరోసారి యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలన్న డిమాండ్‌పై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ, యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో జేఏసీ నేతలు నిరసనల్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 15న జేఏసీ ఇచ్చిన నోటీసు నేపథ్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంత సిబ్బందితోనే నిర్వహించాలని జేఏసీ నాయకులు మరోసారి డిమాండ్ చేశారు.
ఈ నెల 13న 1,450 విద్యుత్ బస్సుల నిర్వహణకు సంబంధించి ప్రైవేట్ ఆపరేటర్లకు టెండర్లు ఇచ్చినట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ టెండర్లను రద్దు చేసి, బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీ ఉద్యోగులకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు సేవలందించే బాధ్యతను ఆర్టీసీనే నిర్వహించాలని స్పష్టం చేసింది.

అయితే, ఇది ప్రభుత్వ నిర్ణయమని, టెండర్లను రద్దు చేయడం సాధ్యం కాదని ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ తెలిపినట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. అయితే మూసేసిన విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్లు పిలిచి, డిపోల పునఃప్రారంభానికి సంబంధించిన పనులు చేపడతామని జేఎండీ శివప్రసాద్ తెలిపినట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు.అలాగే
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 4,000 డీజిల్ బస్సులను తక్షణమే కొనుగోలు చేయాలని కోరింది. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కారణంగా పెరిగిన ప్రయాణికుల రద్దీకి సరిపడా రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో కూడా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కొత్త బస్సులు అవసరమని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించేందుకు భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
