ఏపీఎస్ ఆర్టీసీ బస్సెక్కుతున్నారా?.. అయితే జాగ్రత్త..!!
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం అని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటుంది. ఎటువంటి ప్రమాదాలకు లోనవకుండా జాగ్రత్తగా గమ్యం చేరుస్తారనే నమ్మకం ప్రజలకు ఆర్టీసీ బస్సులపై ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సెక్కితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు రెండువేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిస్తోంది. ఒక్కో బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్ల అవసరం ఉంటుంది. డ్రైవర్లకు కొరతగా ఉండటంతో ఆన్ కాల్ డ్రైవర్లను సంస్థ అందుబాటులో ఉంచుతోంది. అత్యవసర సమయంలో వీరిని డ్రైవింగ్ కు పిలిపించి రోజుకు రూ.800 చెల్లిస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వీరిని తీసుకుంటున్నప్పటికీ ప్రయివేటు వాహనాలు నడిపే డ్రైవర్లు ఎలా డ్రైవింగ్ చేస్తారో మనకు తెలిసిందే. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల డ్రైవింగ్ కు, ఆర్టీసీలో అద్దెకు తిరిగే బస్సుల డ్రైవింగ్ కు చాలా తేడా ఉంటుంది. సంస్థకు అవసరమైన శాశ్వత డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని, ప్రయివేటు డ్రైవర్లతో బస్సులను నడిపే విధానానికి స్వస్తి పలకాలంటూ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయివేటు డ్రైవర్ల అడ్డగోలు డ్రైవింగ్ వల్లే ఇటీవలికాలంలో ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడం మానుకోవాలంటూ ఆర్టీసీ యాజమాన్యానికి హితవు పలుకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి డ్రైవర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులు ఇటీవలి కాలంలో తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రయాణం ఎంతో సురక్షితమని చెప్పే ఆర్టీసీలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రయాణికులకు కూడా అంతుపట్టకుండా ఉంది. ఇప్పుడు ఆన్ కాల్ డ్రైవింగ్ వ్యవస్థ ఉందని తేలడంతో తాము ఎక్కిన బస్సు ను ఆర్టీసీ డ్రైవర్ నడుపుతున్నారో? అద్దెకు తెచ్చిన డ్రైవర్ నడుపుతున్నారో అర్థంకాక ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications